ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణ పతకం..
జనం వాయిస్, న్యూయార్క్, జూన్ 14: :తుర్కియే వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 పోటీల్లో భారత్ చరిత్ర సృష్టించింది. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత జోడీ ధీరజ్ బొమ్మదేవర– కుంకుమ్ మొహోద్ అద్భుత ప్రదర్శనతో ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను 5-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యే-జిన్, కిమ్ జె-డివోక్ జోడీని భారత ద్వయం వరుస సెట్లలో ఆధిపత్యంగా ఎదుర్కొంది. తొలి సెట్ నుంచే దూకుడుగా ఆడిన భారత్ 37-36, 37-36 స్కోర్లతో మొదటి రెండు రౌండ్లను గెలుచుకుని ఆధిక్యం సాధించింది. మూడో రౌండ్ 39-39తో సమంగా ముగిసినా, మొత్తం పాయింట్ల ఆధారంగా భారత్ విజేతగా నిలిచింది.
మ్యాచ్ చివరి దశలో ధీరజ్ బొమ్మదేవర వరుసగా రెండు పర్ఫెక్ట్ 10లు కొట్టడం మ్యాచ్‌కు కీలక మలుపుగా మారింది. అతని అద్భుత గురితప్పని షాట్లు దక్షిణ కొరియా జట్టుకు అవకాశమే ఇవ్వకుండా భారత్‌కు స్వర్ణ పతకాన్ని ఖాయం చేశాయి.
రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్‌కు ఇది నాలుగేళ్ల తర్వాత వచ్చిన ప్రపంచకప్ స్వర్ణం. చివరిసారిగా 2022లో రిధి ఫోర్, తరుణ్‌దీప్ రాయ్ జోడీ ఈ ఘనత సాధించింది.
ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్ జోడీకి ప్రపంచకప్ స్థాయిలో ఇది తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. ప్రస్తుతం భారత అగ్రశ్రేణి ఆర్చర్‌గా కొనసాగుతున్న ధీరజ్ వ్యక్తిగత విభాగంలో కూడా పతక రేసులో ఉన్నాడు. మరోవైపు కేవలం 17 ఏళ్ల వయసులోనే కుంకుమ్ మొహోద్ అంతర్జాతీయ వేదికపై మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఈ ఏడాది షాంఘై ప్రపంచకప్ స్టేజ్-2లో భారత మహిళల రికర్వ్ జట్టుతో కలిసి ఆమె ఇప్పటికే స్వర్ణ పతకం గెలిచింది.
ఈ విజయంతో ప్రపంచ ఆర్చరీలో భారత్ తన సత్తా మరోసారి చాటగా, రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లకు భారత జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.