ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య.
– నిజామాబాద్‌లో సంచలన ట్విస్ట్.
– గుండెపోటుగా చిత్రీకరించిన భార్య–ప్రియుడు.
– రీ పోస్టుమార్టంతో వెలుగులోకి వచ్చిన నిజాలు.
జనం వాయిస్, నిజామాబాద్:
నిజామాబాద్‌లో భర్త హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భార్య తన భర్తను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతుడు పల్లటి రమేష్ పేరిట రూ.2 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ పాలసీలు ఉండటమే ఈ నేరానికి కారణమని పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం, భార్య సౌమ్యకు ప్రియుడు దిలీప్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధానికి అడ్డు తొలగించుకోవడంతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులతో పారిపోవాలనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ రూపొందించినట్లు దర్యాప్తులో బయటపడింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి గొంతు నులిమి హత్య చేసి, గుండెపోటుతో సహజ మరణం జరిగినట్లు చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రారంభంలో కుటుంబ సభ్యులు కూడా ఇది సహజ మరణమేనని భావించారు. అయితే మృతుడి తమ్ముడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శవానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదికలో హత్యకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
పోలీసుల లోతైన విచారణలో భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ ఇద్దరూ హత్య చేసినట్లు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చేసిన ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.