ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు ఆపండి.
-కాంగ్రెస్, బీజేపీపై హరీశ్ రావు విమర్శలు.
జనం వాయిస్,తెలంగాణ డెస్క్:
రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్,బీజేపీ ఒకరిని మించి ఇంకొకరు నటిస్తున్నారని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు.బీజేపీ పార్టీ కేంద్రంలో,కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది.ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపేవారెవరని ప్రశ్నించారు.పార్లమెంట్‍లో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి ఈ రెండు పార్టీలు కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు. బీసీ బంద్ నేపథ్యంలో ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన హరీశ్ రావు పార్లమెంట్‍లో బీజేపీకి 240 మంది ఎంపీలు,కాంగ్రెస్‍కు 99 ఎంపీల బలం ఉందని రిజర్వేషన్ల బిల్లు పెంపును అడ్డుకునేది ఎవరని నిలదీశారు. రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తూ బీసీలను అవమానిస్తున్నాయని దుయ్యబట్టారు. ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు బీసీ గణన చేయలేదు. బీజేపీ ఏకంగా జన గణనను నాలుగేళ్లుగా వాయిదా వేసిందని విమర్శించారు. గడిచిన 35 ఏళ్ళల్లో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బీజేపీ 17 ఏళ్లు పాలిస్తే ఏనాడు ఈ రెండు పార్టీలకు బీసీలు గుర్తుకు రాలేదన్నారు. కానీ ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నాయన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005 లోనే కోరిన దేశంలోనే ఏకైక నేత కేసీఆర్ అని గుర్తు చేశారు. రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చలనం రాలేదు. ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదు, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదన్నారు. జిత్నీ ఆబాదీ, ఉత్నా హక్ అని చెప్పే రాహుల్ గాంధీ పార్లమెంట్‍లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టడం లేదు అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మొత్తం ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని ఎలాంటి పోరాటానికైనా బీఆర్ఎస్ కలిసి వస్తుందన్నారు. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలు పెట్టాలని కాంగ్రెస్, బీజేపీలను డిమాండ్ చేశారు.