janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 4:17 pm Digital Edition : JANAM VOICE

ఏపీ లో ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు.

ఏపీ లో ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు.

– మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు హాజరు.

– ఫస్ట్ ఇయర్ ప్రశ్నపత్రంలో కీలక మార్పులు.

జనం వాయిస్, అమరావతి, ఫిబ్రవరి 16:

ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ విద్యా మండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 5,31,275 మంది, రెండో సంవత్సరంలో 5,26,624 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 10,57,899 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది మొదటి సంవత్సరంలో సిలబస్, ప్రశ్నపత్రాల విధానంలో కీలక మార్పులు చేశారు. ఇప్పటివరకు 24 పేజీల జవాబు పుస్తిక ఇస్తుండగా, ఈసారి మొదటి సంవత్సరం విద్యార్థులకు 32 పేజీల పుస్తిక ఇవ్వనున్నారు. ప్రశ్నపత్రంలోని అన్ని ప్రశ్నలకు అదే పుస్తికలో సమాధానాలు రాయాలి. అదనపు పేజీలు ఇవ్వబోమని మండలి స్పష్టం చేసింది. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రంలో ప్రశ్నల సంఖ్య పెరగడంతో పేజీల సంఖ్యను పెంచారు.
రెండో సంవత్సరం విద్యార్థులకు గతంలానే 24 పేజీల పుస్తిక ఇస్తారు. వృక్ష శాస్త్రం, జంతుశాస్త్రం పరీక్షలను కలిపి జీవ శాస్త్రంగా ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు. పార్ట్ ఏలో వృక్ష శాస్త్రం నుంచి 43 మార్కులు, పార్ట్ బీలో జంతుశాస్త్రం నుంచి 42 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటికి విడివిడిగా రెండు పుస్తికలు అందిస్తారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒక మార్కు ప్రశ్నలు కూడా ప్రవేశపెట్టారు. ఆర్థిక శాస్త్రం, చరిత్ర, రాజ్యాంగ శాస్త్రం వంటి విషయాలకు కూడా ప్రశ్నల సంఖ్య పెరిగింది. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రంలో 85 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఉత్తీర్ణతకు 35 శాతం మార్కులు అవసరం. మొదటి సంవత్సరంలో ఒక్కో విషయానికి కనీసం 29 మార్కులు, రెండో సంవత్సరంలో 30 మార్కులు రావాలి. రెండు సంవత్సరాల మొత్తంలో 59.5 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు.