క్రెడిట్ కార్డుతో నగదు తీస్తే భారీ ఛార్జీలు.
జనం వాయిస్, న్యూఢిల్లీ, జులై 17:
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతోంది. డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి సౌకర్యాల కారణంగా చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే కార్డును సరైన విధంగా వినియోగించకపోతే అధిక వడ్డీ, భారీ ఛార్జీల భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డుతో ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరించుకోవడం అత్యంత ఖరీదైన లావాదేవీల్లో ఒకటిగా పేర్కొంటున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో కొందరు క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి నగదు తీసుకుంటుంటారు. అయితే ఇలా తీసుకున్న మొత్తంపై నగదు ఉపసంహరణ జరిగిన రోజు నుంచే వడ్డీ లెక్కింపు ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ప్రత్యేక క్యాష్ అడ్వాన్స్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా క్రెడిట్ కార్డు పరిమితిలో కొంత శాతం వరకు మాత్రమే నగదు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మిగిలిన పరిమితిని కొనుగోళ్ల కోసం మాత్రమే వినియోగించాలి.
వివిధ బ్యాంకులు నగదు ఉపసంహరణపై వేర్వేరు రకాల ఛార్జీలు విధిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఉపసంహరించిన మొత్తంపై 2.5 శాతం లేదా కనిష్ఠంగా రూ.500 క్యాష్ అడ్వాన్స్ ఫీజు వసూలు చేస్తోంది. అలాగే నెలకు 1.05 శాతం నుంచి 3.60 శాతం వరకు వడ్డీ విధిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా 2.5 శాతం లేదా కనిష్ఠంగా రూ.500 ఫీజుతో పాటు నెలకు 1.99 శాతం నుంచి 3.60 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్ నగదు ఉపసంహరణపై 2.5 శాతం లేదా కనిష్ఠంగా రూ.500 క్యాష్ అడ్వాన్స్ ఫీజు విధించడంతో పాటు నెలకు 2.49 శాతం నుంచి 3.67 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 2.5 శాతం లేదా కనిష్ఠంగా రూ.500 ఛార్జీతో పాటు నెలకు 2.75 శాతం నుంచి 3.50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది. కోటక్ మహీంద్ర బ్యాంక్ ప్రతి రూ.10 వేల నగదు ఉపసంహరణపై రూ.300 క్యాష్ అడ్వాన్స్ ఫీజు విధిస్తుండగా, నెలకు 2.49 శాతం నుంచి 3.50 శాతం వరకు వడ్డీ అమలు చేస్తోంది.
క్రెడిట్ కార్డును ప్రధానంగా కొనుగోళ్లు, డిజిటల్ చెల్లింపుల కోసం మాత్రమే ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నగదు అవసరాల కోసం క్రెడిట్ కార్డును వినియోగించడం వల్ల అధిక వడ్డీ, అదనపు ఛార్జీల రూపంలో ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల క్రెడిట్ కార్డు నిబంధనలను ముందుగానే తెలుసుకుని, బిల్లులను గడువులోగా చెల్లించడం ద్వారా అనవసర ఖర్చులను నివారించవచ్చని సూచిస్తున్నారు.