janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 6:54 pm Digital Edition : JANAM VOICE

టీటీడీ చైర్మన్‌పై ఆరోపణలు..

టీటీడీ చైర్మన్‌పై ఆరోపణలు..

భూమన కౌంటర్‌, బి ఆర్ నాయుడు ప్రతిస్పందన.
నకిలీ దృశ్యాల వివాదానికి రాజకీయ రంగు
రాజీనామా డిమాండ్‌తో తీవ్ర వాగ్వాదం.

జనం వాయిస్, తాడేపల్లి, మార్చి 01:

తనపై నకిలీ దృశ్యాలతో అసత్య ప్రచారం జరుగుతోందని టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలకు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అది నకిలీ దృశ్యం కాదని, సమగ్ర విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ పదవికి బి ఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే మరిన్ని వాస్తవాలు బయటపడతాయని హెచ్చరించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి, సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే హిందువుల హృదయాలు మండిపోతున్నాయని వ్యాఖ్యానించారు. తొంభై నాలుగు సంవత్సరాల టీటీడీ పాలకమండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనైతిక చర్యలకు పాల్పడిన వ్యక్తిని చైర్మన్‌గా నియమించారని ఆరోపించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పదవి నుంచి తప్పుకోవాల్సిందని, కానీ దానికి బదులుగా నెపాన్ని వైసీపీపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
బి ఆర్ నాయుడు తనపై వచ్చిన ఆరోపణలను కృత్రిమ మేధస్సు ఆధారిత నకిలీ దృశ్యాలుగా పేర్కొంటున్నారని, అయితే తాను కొందరు నిపుణులతో మాట్లాడగా ఆ దృశ్యాలు నిజమైనవేనని వారు చెప్పారని భూమన తెలిపారు. సిగ్గుంటే మౌనంగా రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలని సూచించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా భూమన చేసిన డిమాండ్‌పై బి ఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. తనను రాజీనామా చేయమని చెప్పే హక్కు భూమనకు లేదని ప్రశ్నించారు. తాము బయటపెడుతున్న అక్రమాల కారణంగానే ఈ విధంగా ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. తమపై జరుగుతున్న ప్రచారం డైవర్షన్ కోసం పన్నిన కుట్ర అని ఆరోపించారు. ఈ వ్యవహారంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.