janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 1:05 am Digital Edition : JANAM VOICE

నగ్నంగా నిలబెట్టి తనిఖీలు చేసేవారు!

నగ్నంగా నిలబెట్టి తనిఖీలు చేసేవారు!

తీహార్ జైలులో దారుణ పరిస్థితులు..

జనం వాయిస్, న్యూఢిల్లీ, సెప్టెంబర్ 09:

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి సందీపా విర్క్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భయానక అనుభవాలను వెల్లడించారు. రూ.6 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమె దాదాపు నాలుగున్నర నెలల పాటు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. జైలులో తాను ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులను గుర్తుచేసుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

జైలులోకి వెళ్లిన సమయంలో ఖైదీలను తనిఖీ చేసే విధానం తనకు తీవ్ర ఇబ్బందిని కలిగించిందని సందీపా తెలిపారు. సిబ్బంది దుస్తులు విప్పించి శరీరంలోని ప్రైవేట్ భాగాలను కూడా టార్చ్‌లైట్‌తో పరిశీలించేవారని ఆరోపించారు. చలికాలంలోనూ ఇలాంటి తనిఖీలు చేసేవారని చెప్పారు.

ఒక రోజులోనే రెండు, మూడు సార్లు దుస్తులు తొలగించి తనిఖీలు నిర్వహించేవారని.. ఇలా వందలాది సార్లు తనిఖీలకు గురికావడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని ఆమె పేర్కొన్నారు. మహిళా సిబ్బంది తనిఖీ చేస్తున్నారనే కారణంతో ఈ ప్రక్రియను తేలికగా తీసుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంత కఠినంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ జైలులోకి మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువులు ఎలా చేరుతున్నాయని సందీపా ప్రశ్నించారు. డబ్బు ఉంటే జైలులో ఏదైనా సాధ్యమవుతుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

అంతేకాకుండా జైలులో ఆహారం, టాయిలెట్లు అత్యంత అపరిశుభ్రంగా ఉండేవని చెప్పారు. జైలులో మొదటి రోజే 25-26 మంది ఉన్న గదిలో తనను ఉంచారని గుర్తుచేసుకున్నారు. అక్కడి పరిస్థితులు, నిరంతర మానసిక ఒత్తిడి తనను తీవ్రంగా కుంగదీశాయని తెలిపారు.

ఆ సమయంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. జైలులో ఉన్న సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు కూడా వెళ్లినట్లు సందీపా కన్నీటిపర్యంతమయ్యారు. జైలు జీవితం తన జీవితంలోనే అత్యంత భయానకమైన అనుభవాల్లో ఒకటిగా ఆమె అభివర్ణించారు.