పిల్లలకు ఆస్తులు కంటే మంచి విద్యను అందించాలి.
-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
జనం వాయిస్, తెలంగాణ:
తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తుల కంటే మంచి విద్యను అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంబర్‌పేట మండల రికగ్నైజ్డ్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించి, సన్మానించే కార్యక్రమం తో పాటుగా పదో తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులను ఆశీర్వదించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించి దగ్గర ఉండి చదివించాలని, తల్లిదండ్రులు అందరినీ ఇదే కోరుతున్నామని అన్నారు. ఈ సందర్బంగా అవార్డ్స్ అందుకున్న విద్యార్థుల కు, టీచర్స్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలాంటి ప్రోత్సాహకరమైన కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య మంచి పోటీతత్వం పెరుగుతుందని, వారు చేసిన కష్టానికి ఫలితం, గుర్తింపు దక్కిందనే సంతృప్తిని ఇస్తుందన్నారు. నేటి సమాజంలో అందరికీ విద్య ముఖ్యమైనదిగా మారిందని చెప్పారు. గతంలో బడిలో పిల్లలను చేర్పించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టాలని, కాలక్రమేణా అది మారి తల్లిదండ్రులే పిల్లలను స్వతహాగా పాఠశాలకు పంపిస్తున్నారన్నారు. ఈ మంచి మార్పు సమాజంలో కనిపిస్తుందని, ఇది మన దేశ అభివృద్ధికి శుభసూచకం అని చెప్పారు. తమ పిల్లలు స్వతహాగా తమ కాళ్ల మీద తాము నిలబడేలా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు, పేదలకైనా ధనవంతులకైనా చదువు అనేది ముఖ్యమైనదిగా మారిందన్నారు.నేడు దేశంలోని ప్రముఖులంతా పేరు తెచ్చుకున్న వారంతా నాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని వచ్చినవారేనని, పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు వద్దని సూచించారు. అంబర్‌పేట లోని స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులకు ఫీజుల విషయంలో ఇబ్బంది కలగకుండా చూస్తున్నాయని, విద్య అనేది విద్యార్థులకు తప్పనిసరి అని తెలియజేశారు. డిమాండ్ కు తగ్గ కోర్సులు చదువుకోవడం ముఖ్యం. ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. మాతృభాషకు కూడా నూతన విద్యా విధానంలో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆంగ్లం తో పాటు మాతృభాష అయిన తెలుగుపై దృష్టి పెట్టాలని, ఆంగ్ల భాషతో పాటు మాతృభాషను ప్రోత్సహించాలని సూచించారు.