janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 October 2025, 2:48 pm Digital Edition : JANAM VOICE

పేకాట ఆడిన మాజీ ఎమ్మెల్యే అరెస్టు..!!

– పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు
– వరంగల్‌ జిల్లా మట్టెవాడ పీఎస్ పరిధిలో ఇంట్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ దోనెపూడి రమేశ్‌బాబు.. రూ.3.68 లక్షలు, 15 ఫోన్లు స్వాధీనం
– పక్కా సమాచారంతో దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు
– పేకాట రాయుళ్లలో పలువురు కార్పొరేటర్లు, రాజకీయ ప్రముఖులు

జనం వాయిస్ దినపత్రిక, వరంగల్:

వరంగల్‌ కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేకాట ఆడుతూ ప్రముఖులు పట్టుబడిన ఘటన మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిదిలో వెలుగు చూసింది. ఆదివారం రాత్రి కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు ఇంట్లో పేకాటశిబిరం కొనసాగుతున్నట్టు అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు, వరంగల్‌ స్టేషన్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన గూడూరు హరిబాబు, కాజీపేటకు చెందిన వలుపదాసు సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, హంటర్‌రోడ్డు శాయంపేటకు చెందిన మాజీ కార్పొరేటర్‌ మాడిశెట్టి శివశంకర్‌, మామునూరుకు చెందిన నోముల తిరుపతిరెడ్డి, గిర్మాజీపేటకు చెందిన రావర్ల శ్రీనివాసరావు, సయ్యద్‌ జావీద్‌, కొత్తవాడకు చెందిన నీలం రాజ్‌కిశోర్‌ (తెలంగాణ ఉద్యమకారుడు), రామన్నపేటకు చెందిన పరిశల నాగరాజు, పోచమ్మమైదాన్‌కు చెందిన 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ బస్వరాజు కుమారస్వామి, చింతం సంతోష్‌, సంగెం మండలం నల్లబెల్లికి చెందిన మేరు వీరేశం ఉన్నట్టు తెలిపారు.వారి నుంచి రూ.3,68,530 నగదు, 15 సెల్‌ఫోన్లు, పేకాట కార్డులు, టోకెన్లను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ తెలిపారు. చింతం సంతోష్‌ గతంలో పేకాట శిబిరాలు నిర్వహించి, అధిక వడ్డీకి నగదు లావాదేవీలు కొనసాగించినట్టు ఆరోపణలున్నాయి. వీరిని మట్టెవాడ పోలీసులకు అప్పగించారు.