ఫిఫా ప్రపంచకప్ విజేతలకు తొలిసారి ‘ఛాంపియన్‌షిప్ రింగ్స్’.
జనం వాయిస్, న్యూయార్క్, జులై 17:
ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫిఫా ప్రపంచకప్–2026లో విజేతగా నిలిచే జట్టుకు ఈసారి సరికొత్త గౌరవం దక్కనుంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా ట్రోఫీ, బంగారు పతకాలతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన ‘ఛాంపియన్‌షిప్ రింగ్స్’ను కూడా అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అమెరికన్ క్రీడల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ సంప్రదాయాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో తొలిసారిగా అమలు చేయనున్నారు.
ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఈ ప్రత్యేక ఉంగరాల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. తొలుత విజేత జట్టు కెప్టెన్, ప్రధాన కోచ్‌కు ప్రత్యేక రింగ్స్ అందజేస్తారు. అనంతరం జట్టు సభ్యుల కోసం రూపొందించిన మొత్తం 30 ఒరిజినల్ రింగ్స్‌ను అధికారికంగా బహూకరిస్తారు. ప్రతి రింగ్‌పై ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ ప్రతిరూపంతో పాటు విజేత జట్టుకు సంబంధించిన ప్రత్యేక డిజైన్ ఉంటుంది. ప్రతి ఉంగరానికి ప్రత్యేక సీరియల్ నంబర్‌తో పాటు అసలైనదని ధ్రువీకరించే ప్రమాణపత్రం కూడా అందజేయనున్నారు.
ఈ అరుదైన జ్ఞాపకాన్ని అభిమానులకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 2,026 ఛాంపియన్‌షిప్ రింగ్స్‌ను తయారు చేయాలని ఫిఫా నిర్ణయించింది. అందులో 30 రింగ్స్ విజేత జట్టుకు కేటాయించగా, మిగిలిన 1,996 రింగ్స్‌ను అధికారిక లైసెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులకు విక్రయించనున్నారు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో భాగమైన ప్రత్యేక జ్ఞాపకాన్ని అభిమానులు సొంతం చేసుకునే అవకాశం లభించనుంది.
ఇదిలా ఉండగా, 2026 ఫిఫా ప్రపంచకప్ తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఫైనల్లో యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్లు తలపడనున్నాయి. సెమీఫైనల్లో ఫ్రాన్స్‌పై విజయం సాధించిన స్పెయిన్ ఫైనల్‌కు చేరుకోగా, అర్జెంటీనా వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించి మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది. ఈ తుది పోరుపై ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.