janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 4:31 pm Digital Edition : JANAM VOICE

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వేగవంతం చేయాలి.

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వేగవంతం చేయాలి.

ఇప్పటికే రూ.2,550 కోట్లు విడుదల.. లబ్ధిదారులకు పరిహారం చేరేలా చర్యలు.

అవార్డులు జారీ చేసిన భూములకు ముందుగా పరిహారం చెల్లించాలి.

ప్రతి వారం పురోగతిపై సమీక్ష నిర్వహించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.

జనం వాయిస్, పెద్దపల్లి, సెప్టెంబర్ 21:

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం–పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పెండింగ్ భూసేకరణ, పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనుల పురోగతిని సమీక్షించారు.

2026–27 ఆర్థిక సంవత్సరంలో భూసేకరణకు రూ.6 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.1,050 కోట్లు, మరో రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.2,550 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. విడుదలైన నిధులు అధికారుల ఖాతాల్లోనే ఉండకుండా లబ్ధిదారులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

అవార్డులు జారీ చేసిన భూములకు పరిహారం చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. నిధుల కొరత లేదా ఇతర కారణాలతో చెల్లింపులు నిలిచిపోతే ప్రభుత్వానికి వివరాలు పంపి అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.

భూసేకరణ పనులకు ప్రత్యేక అధికారులను నియమించి బాధ్యతలు అప్పగించాలని, ప్రతి వారం పురోగతిపై సమీక్ష నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

రైతులతో చర్చించి పరిహారం

భూసేకరణలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతులతో నేరుగా చర్చించి స్నేహపూర్వక వాతావరణంలో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. నిబంధనల ప్రకారం రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా, మార్కెట్ విలువకు సాధ్యమైనంత సమీపంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయ్యేలోపు పెండ్లిపాకల రిజర్వాయర్ పనులు పూర్తయ్యేలా భూసేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. సమస్యలు ఎదురైతే హైదరాబాద్‌లోని భూసేకరణ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు.

అవార్డు భూములకు మొదటి ప్రాధాన్యత

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇప్పటికే అవార్డులు జారీ చేసిన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపులను మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అవార్డు జారీ చేసిన తర్వాత కూడా పరిహారం అందకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందన్నారు. పెండింగ్ భూసేకరణపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

రూ.2,514 కోట్ల నిధుల విడుదల

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులకు సంబంధించి సుమారు రూ.3,100 కోట్ల విలువైన పనులను గుర్తించగా, రూ.2,514 కోట్ల మేర నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. పరిహారం నేరుగా రైతులకు చేరేలా కలెక్టర్లు చర్యలు తీసుకుని భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.