ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం!
-సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.
జనం వాయిస్ దినపత్రిక:
తెలంగాణ సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఈ అంశంపై గతంలోనే చర్చ జరగగా తాజా సమా వేశంలో చట్టాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే పంచాయ తీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని సవరించే దస్త్రంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. కాగా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో జరిపిన చట్ట సవరణను తెలంగాణ పంచాయతీ రాజ్ అధికారులు అధ్యయనం చేశారు. దాన్ని అనుసరించి రాష్ట్రంలోనూ చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసి సమర్పించగా మంత్రి ఆమోదించారు.ఈ సవరణను ఇవాళ మంత్రివర్గ సమావేశంలో సమర్పించడంతో చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీపై మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.