janamvoice.com
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 9:12 am Digital Edition : JANAM VOICE

మే 1న లాడ్జిలో రాబరీ గ్యాంగ్!!

మే 1న లాడ్జిలో రాబరీ గ్యాంగ్!!

3 న..కరీంనగర్ పిఎంజె జ్యువలరీ లో దోపిడీ…

రెండు రోజుల ముందే ధర్మపురిలో అడ్డా..!!

పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ నిజాలు!

ప్రత్యేక కోణాలలో.. పోలీసుల వేట.

అసాంఘిక శక్తులకు సేఫ్ షెల్టర్ గా వసతి గృహాలు!!

తెలంగాణ వ్యాప్తంగా ముఖ్య పట్టణాలలో జరుగుతున్న “లాడ్జి లాజిక్”!

లాడ్జీలపై లోపించిన నిఘా నా ?..

ఐడీ వెరిఫికేషన్‌లో నిర్లక్ష్యం ఎందుకో..!

పోలీస్ నిఘా లేకపోతే..  ప్రమాదమే!?

జనం వాయిస్, వెబ్ డెస్క్:

తెలంగాణ లో తెలంగాణ వ్యాప్తంగా ముఖ్య పట్టణాలలో జరుగుతున్న “లాడ్జి సెంటర్ లాజిక్”  ఇప్పుడు అందరిని ఆలోచింపజేస్తుంది.. ఒక పోలీస్ శాఖ నిర్లక్ష్యమే కాదు లాడ్జిలలో డబ్బుల కోసం ఎవడికి పడితే వాడికి రూములు (షెల్టర్) లాడ్జి నిర్వాహకులు ఇవ్వడం చట్టపరంగా నేరమే.. 
కరీంనగర్ గోల్డ్ రాబరీ నిందితులు మే 1 న..ధర్మపురి లాడ్జిలో బస చేసి పక్కాగా రెక్కి నిర్వహించి ..మే 3 న కరీంనగర్ పీఎంజీ జ్యువలరీ దోపిడీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. బంగారు దుకాణం లో దోపిడీ చేసేందుకై రెండు రోజుల నుండి ధర్మపురి షెల్టర్ గా చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో బయటపడ్డది..

*కరీంనగర్ గోల్డ్ రాబరీ*

కరీంనగర్ లోని జ్యోతినగర్ వద్ద ఉన్న పీఎంజే జ్యువెలరీ షాప్ లో 2026 మే 3, ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో రాబరీ సంఘటన చోటు చేసుకుంది… రాబరీ జరిగిన సంఘటన వివరాలను ప్రకారం…
ఐదుగురు ఆయుధాలతో (తుపాకులతో) కస్టమర్ల రూపంలో షాపులోకి చొరబడి, 1 కేజీకి పైగా బంగారం దోచుకెళ్లారు.. దొంగలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు.నిందితులు దొంగలు హిందీ, తెలుగులో మాట్లాడారని పోలీస్ లు గుర్తించారు, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి, సెక్యూరిటీ గార్డుకు గంతలు కట్టి పారిపోయారు.  దీనితో పోలీసుల సిసిటివి ఆధారంగా నిందితుల కోసం 12 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

*నిందితులు దొంగ పేరుతో… డూప్లికేట్ ఐడి ప్రూఫ్ లతో*

గోల్డ్ రాబరీ నిందితులు ధర్మపురి లాడ్జిలో సౌరవ్ కుమార్ అనే దొంగ పేరుతో రెండు రూములు అద్దెకి తీసుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన డూప్లికేట్ ఆధార్ నెంబర్ ని ఐడీ ప్రూఫ్ గా చూపడం తో నిర్వాహకులు రూమ్ ఇచ్చారు. మొదట నలుగురు, ఆ తర్వాత మరో వ్యక్తి కలిసి బస చేయగా భోజనం ఇతరత్రా అవసరాలకు లాడ్జి సిబ్బందికి డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నారు. అయితే ఎక్కడ కూడా వారి ఫోన్ నెంబర్ ఇవ్వకుండా యూపీఐ పేమెంట్స్ చేయకుండా జాగ్రత్తపడ్డారు. రెండు రాత్రులు అదే లాడ్జిలో గడిపిన నిందితులు ప్రతిరోజు మద్యం తాగేవారని రాబరీ జరిగిన రోజు ఉదయం లాడ్జి వేకెట్ చేసి వెళ్లిపోయారని నిర్వాహకులు తెలిపారు.అయితే
పీఎంజే జ్యువెలరీలో డెకాయిట్ గ్యాంగ్ దోపిడీ  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

*డెకయిట్ గ్యాంగ్ టార్గెట్.. ప్రత్యేక పోలీసు టీమ్ వేట..*

దోపిడీ చేసిన నిందితులు జగిత్యాల జిల్లా ధర్మపురి లోని ఓ ప్రైవేట్ లాడ్జీలో బస చేసినట్లు పోలీసులు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. నేరస్తులు పట్టణాల్లోని లాడ్జీలను తాత్కాలిక ఆశ్రయాలుగా ఉపయోగించుకుంటున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో అసలు లాడ్జీల నిర్వహణ నిబంధనల మేరకే నడుస్తుందా.. అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నామ మాత్రంగా ఐడీ వెరిఫికేషన్ చేస్తూరూమ్ లు అద్దెకు ఇస్తుండడం ఆందోళన కరంగా మారింది. దోపిడీ జరిగింది కరీంనగర్ లో అయినా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితులు ధర్మపురి లో షెల్టర్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామంతో అసలు లాడ్జీలపై పోలీస్ నిఘా, తనిఖీల స్థాయి ఎంతవరకు సమర్థవంతంగా ఉందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

*నిబంధనలు ఉన్నా అమలులో లోపాలు*

నిబంధనల ప్రకారం ప్రతి లాడ్జీలో గెస్ట్ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలి. షెల్టర్ కోసం దిగిన వారి పూర్తి వివరాలు, ఐడీ ప్రూఫ్, మొబైల్ నంబర్లు నమోదు చేయడం కచ్చితంగా అమలు కావాలి.ప్రతి లాడ్జి లో సీసీ కెమెరాలు తప్పనిసరి. అయితే వాస్తవ పరిస్థితుల్లో కొన్ని లాడ్జీల్లో ఈ ప్రక్రియ కేవలం నామమాత్రంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అవకాశాన్ని నేరస్తులు వినియోగించుకుని తమ ఆనవాళ్లను దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దొంగ ఐడీలతో తప్పుడు సమాచారం ఇచ్చి రూమ్ లు తీసుకుని పని కానిచ్చి వెళ్లిపోతున్నారు. లాడ్జీల నిర్వాహకులు ఐడీ వెరిఫికేషన్ తో పాటు పూర్తి అడ్రస్ ఫోన్ నెంబర్ తదితర వివరాలు క్రాస్ చెక్ చేసుకుని రూమ్ ఇస్తే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం తక్కువ. ఒకవేళ జరిగిన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నిందితులను పట్టుకోవడం సులభతరం అవుతుంది.

*పోలీసుల నిరంతర నిఘా అమలావుతుందా??*

మరోవైపు, రెగ్యులర్ పోలీస్ చెకింగ్ విషయంలోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు ప్రత్యేక దాడులు జరిగినప్పటికీ, నిరంతర తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాడ్జీల్లో అనుమానాస్పద కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్ నిఘా మరింత కట్టుదిట్టం కావాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.కొన్ని చోట్ల అనుమతులు తీసుకుని నడిపిస్తుంటే కొండగట్టు, ధర్మపురి వంటి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో అనుమతి లేని లాడ్జిలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి.ఇలాంటి వాటిపై కొరడా ఝులిపించాల్సిన పోలీసు అధికారులు కూడా అంతా ‘మాములే’అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని జనంలో అనుమానాలకు తొలగిస్తుంది.

*పర్యవేక్షణ లేకపోతే ప్రమాదమే..*

ఈ ఘటన నేపథ్యంలో లాడ్జీ నిర్వాహకుల బాధ్యతపై కూడా చర్చ మొదలైంది. ప్రతి గెస్ట్ నుంచి సరైన ఐడీ తీసుకోవడం, ధృవీకరణ చేయడం, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను వెంటనే పోలీసులకు అందించడం వంటి చర్యలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. లేదంటే లాడ్జీలు నేరస్తులకు సురక్షిత స్థావరాలుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన కనీస భద్రతా ప్రమాణాల అమలుపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి పట్ల ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని రూములు అద్దెకు ఇవ్వాల్సిన అవసరం ఉంది.