వ్యవసాయ భూములు మాత్రమే తీసుకుంటామంటే ఊరుకునేది లేదు.
•రామయ్యపల్లి గ్రామాన్ని కూడా సింగరేణి సేకరించాలి.
•సింగరేణి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.
•మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్.
జనం వాయిస్ దినపత్రిక, రామగిరి:
రామగిరి: సింగరేణి ఓసీపీ టూ విస్తరణ కోసం సింగరేణి యాజమాన్యం రాజాపూర్ గ్రామంతోపాటు 444 ఎకరాల భూమిని తీసుకుంటామని ప్రతిపాధిస్తున్నట్టు సింగరేణి జీఎం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు రామగిరి మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి ఓసీపీ టూ విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట, రాజాపూర్ గ్రామాల పరిధిలోని 708 ఎకరాల వ్యవసాయ భూమిని గతంలో సింగరేణి అధికారులు స్వాదీనం చేసుకున్నారు. దీనిపై రెండు గ్రామాల రైతులు కోర్టుకు వెళ్లగా ఆ భూమిని తిరిగి రైతులకు ఇవ్వడం జరిగింది. తదురపరి 88 ఎకరాలను మాత్రమే తీసుకున్న సింగరేణి అధికారులు.. ఇప్పుడు మరోసారి కుట్రపూరితంగా రాజాపూర్ గ్రామాన్ని మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాపూర్ గ్రామాన్ని తీసుకుంటామని చెప్తున్న సింగరేణి అధికారులు.. రామయ్యపల్లి గ్రామాన్ని తీసుకోకుండా కేవలం రామయ్యపల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములను మాత్రమే తీసుకోవడం వల్ల గ్రామస్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పెద్దంపేట, వన్నూర్, మంగళ్ పల్లి, వీర్లపల్లి, వకీల్ పల్లి గ్రామాల ప్రజలు పడ్డ ఇబ్బందులను కండ్లారా చూసిన మేము ఎట్టిపరిస్థితిలో అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్దంగా లేమని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు మా వ్యవసాయ భూమలు సేకరించే ప్రతిపాదనను విరమించుకోవడమో.. లేదంటే మా గ్రామాన్ని సైతం తీసుకుని గ్రామస్థులకు తగు రీతిలో న్యాయం చేయడమో ఏదో ఒకటి చేసే విధంగా అడుగులు వేయాలని హితవు పలికారు. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటించి సింగరేణి విస్తరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. పోరాటాలు మా ఊరి ప్రజలకు కొత్త కాదని, గతంలో దొరలను,పోలీస్ ను సైతం ఉరికించిన చరిత్ర గ్రామానికి ఉందనే విషయాన్ని సింగరేణి అధికారులు గమనంలోకి తీసుకోవాలని సూచించారు.