Date of Publish : 10 March 2026, 12:27 pmDigital Edition : JANAM VOICE
మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు.తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేసుకున్న కేటీఆర్.
మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు.
తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేసుకున్న కేటీఆర్.
ట్యాంక్‌బండ్‌పై గర్జించిన లక్షల గొంతుకలు.
తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమని వ్యాఖ్య.
అమరవీరులకు నివాళులు అర్పించిన కేటీఆర్.
జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 10:
స్వరాష్ట్ర సాధన కోసం ట్యాంక్‌బండ్‌పై యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై గర్జించి నేటికి 15 సంవత్సరాలు పూర్తయ్యాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఒక కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు.స్వరాష్ట్ర సాధన కోసం నాడు తెలంగాణ ప్రజల్లో ఏర్పడిన ఉద్యమ స్పూర్తి అపారమైందని తెలిపారు. 2011 మార్చి 10న నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా ఎన్నో నిర్బంధాలు, దిగ్బంధాలు, అడ్డంకులు ఉన్నప్పటికీ ఉద్యమకారుల సంకల్పాన్ని అవి దెబ్బతీయలేకపోయాయని కేటీఆర్ తెలిపారు. బ్యారికేడ్లు, ఇనుపకంచెలు ఏర్పాటు చేసినా తెలంగాణ కోసం పోరాడిన ప్రజల ఉత్సాహాన్ని ఆపలేకపోయాయని ఆయన అన్నారు. ఆ రోజు లక్షలాది మంది ట్యాంక్‌బండ్‌పై ఒకే స్వరంతో తెలంగాణ కోసం నినదించారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన పోరాట రూపాల్లో మిలియన్ మార్చ్ ఒకటని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువత, ప్రజా సంఘాల పాత్రను ఆయన ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు చూపిన ఐక్యత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఈ సందర్భంగా కేటీఆర్ స్మరించారు. అమరవీరులకు జోహార్లు తెలుపుతూ జై తెలంగాణ అంటూ తన సందేశాన్ని ముగించారు. మిలియన్ మార్చ్ సందర్భంగా తీసిన పాత చిత్రాలను కూడా ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.