తెలంగాణపై ఎల్‌నినో ముప్పు.. అప్రమత్తంగా ఉండాలి!
- నీరు, విద్యుత్, డబ్బును పొదుపుగా వినియోగించుకోవాలి.
- బోర్లలో పడిపోతున్న భూగర్భ జలమట్టాలు.. రైతులు జాగ్రత్తగా ఉండాలి.
- కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం.
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
జనం వాయిస్, తెలంగాణ, అక్టోబర్ 20:
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తెలంగాణలో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రజలు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నీరు, విద్యుత్‌తో పాటు డబ్బును కూడా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బోరు బావుల్లో భూగర్భ జలమట్టాలు క్రమంగా పడిపోతున్నాయని, రానున్న రోజుల్లో నీటి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు యాసంగి పంటల సాగు విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని, నీటి లభ్యతను అంచనా వేసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నీటి అవసరం అధికంగా ఉండే పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి కుటుంబం ఇప్పటి నుంచే పొదుపు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. రైతులు, సామాన్య ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఉచిత వైద్య సేవలు వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటికే సుమారు 70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు భవిష్యత్తులో తలెత్తే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.