ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన ఈశ్వర్‌కు ఘన సన్మానం.
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. ఈశ్వర్ సాహసం.
జనం వాయిస్, ముత్తారం, అక్టోబర్ 26:
ముత్తారం మండలం ఓడేడు గ్రామంలోని మానేరు నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోతున్న సూరయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి శనిగారపు జైపాల్ భార్య శృతిని తన ప్రాణాలకు తెగించి కాపాడిన ఓగులవేని ఈశ్వర్‌ను గ్రామ పంచాయతీ తరఫున ఘనంగా సన్మానించారు. సకాలంలో స్పందించి శృతిని నీటిలో నుంచి బయటకు తీసి, మంథని ఆసుపత్రికి తరలించడంలో ఈశ్వర్ చూపిన ధైర్యసాహసాలు, మానవత్వం పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ఈ సందర్భంగా ఓడేడు గ్రామ సర్పంచ్ పోతుపెద్ది కవిత కిషన్ రెడ్డి ఈశ్వర్‌ను సన్మానించి అభినందించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం గొప్ప మానవీయ విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి ఆపద్బాంధవులు ఉండటం అభినందనీయమన్నారు. ఇదిలా ఉండగా, ప్రమాదంలో మృతి చెందిన పంచాయతీ కార్యదర్శి జైపాల్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బూర్ల రాజేందర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.