మహాదేవపూర్‌లో ఘనంగా రావణ దహనం.
ప్రజల ఐక్యత, సోదరభావమే సమాజ అభివృద్ధికి పునాది.
రావణ దహనం కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు.
జనం వాయిస్, మహాదేవపూర్, అక్టోబర్ 20:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రావణ దహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలు, పేదధనిక తారతమ్యాలకు అతీతంగా ప్రజలంతా ఒకే వేదికపై పండుగలను జరుపుకోవడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారం ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ధర్మం, న్యాయం వైపు నిలబడాలని ఆకాంక్షించారు. మహాదేవపూర్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దసరా వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషకరమన్నారు. పండుగలు ప్రజల మధ్య అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో జీవించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో తనను ఆత్మీయంగా పలకరించిన ప్రజలకు దుద్దిళ్ల శ్రీను బాబు కృతజ్ఞతలు తెలిపారు.