వర్షాభావ పరిస్థితుల్లోనూ దుర్గామాత నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు.
- నీటి కొరతను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వైఫల్యంగా చిత్రీకరించడం సరికాదు.
- రాజకీయ విమర్శలు మాని వాస్తవాలను గుర్తించాలంటున్న ఎమ్మెల్యే మద్దతుదారులు.
జనం వాయిస్, రామగుండం, అక్టోబర్ 22:
రామగుండం నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా గోదావరిలో నీటి కొరత నెలకొన్నప్పటికీ దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక ఏర్పాట్లు చేయించారని ఆయన మద్దతుదారులు పేర్కొన్నారు. ప్రకృతి పరిస్థితుల కారణంగా ఏర్పడిన నీటి కొరతను ఎమ్మెల్యే వైఫల్యంగా చిత్రీకరిస్తూ రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం చేసేందుకు ఎమ్మెల్యే అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టారని తెలిపారు. గోలివాడ–అంతర్గాం గోదావరి పరిసరాల్లో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని నిమజ్జనానికి అనువైన ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారని వివరించారు. గోదావరిఖని ప్రశాంత్‌నగర్ చెరువును శుభ్రం చేయించి విగ్రహాల నిమజ్జనానికి అనుకూలంగా సిద్ధం చేయించారని పేర్కొన్నారు. అదేవిధంగా సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపంలో నీటి నిల్వ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టారని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, గోదావరిలో నీటి లభ్యత తగ్గడానికి ప్రకృతి పరిస్థితులే కారణమని మద్దతుదారులు అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యల పరిష్కారంతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ నిమజ్జన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసిన ప్రజాప్రతినిధిపై రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. విమర్శలు చేసే ముందు క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని, ప్రజల కోసం చేపట్టిన చర్యలను కూడా గుర్తించాలని ఎమ్మెల్యే మద్దతుదారులు కోరారు.