janamvoice.com
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 11:07 pm Digital Edition : JANAM VOICE

అటవీ ప్రాంతంలో ఇద్దరు పోలీసుల హత్య!

అటవీ ప్రాంతంలో ఇద్దరు పోలీసుల హత్య!

బుల్లెట్ గాయాలతో మృతదేహాల గుర్తింపు.. సర్వీసు తుపాకులు మాయం

ఉగ్రవాదుల దాడిగా అనుమానం.. కుల్గామ్‌ దాడితో సంబంధంపై దర్యాప్తు

జనం వాయిస్, శ్రీనగర్, నవంబర్ 12:

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు స్పెషల్ పోలీసు ఆఫీసర్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. కిశ్త్‌వాడ్‌ జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ అదృశ్యమైన ఇద్దరు పోలీసుల మృతదేహాలు గురువారం ఉదయం అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. వారి శరీరాలపై బుల్లెట్‌ గాయాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో వారి సర్వీసు తుపాకులు కనిపించకపోవడంతో ఉగ్రవాదుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విధులకు వెళ్లి అదృశ్యం

స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌కు చెందిన బాబీ చాంద్‌ (57), రశ్‌పాల్ కుమార్‌ (45) బుధవారం మధ్యాహ్నం తమ క్యాంపు నుంచి ధర్నా-మర్వా ప్రాంతంలోని ఆర్మీ పోస్ట్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో దచన్‌ అటవీ ప్రాంతం నుంచి శబ్దాలు వినిపించడంతో అటువైపు వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత వారు తిరిగి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు.

సర్వీసు తుపాకులు మాయం

పోలీసులు అదృశ్యమైన సమయంలో ఆ ప్రాంతంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలు కూడా పనిచేయకపోవడం గమనార్హం. ఆర్మీ, భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టగా గురువారం ఉదయం ఇద్దరి మృతదేహాలు గుర్తించారు. వారి వద్ద ఉండాల్సిన సర్వీసు తుపాకులు ఘటనాస్థలంలో కనిపించలేదు. దీంతో ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి హత్య చేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు.

కుల్గామ్‌ దాడితో సంబంధం ఉందా?

ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో బుధవారం సీఆర్పీఎఫ్‌ శిబిరంపై ఉగ్రదాడి జరిగింది. మోటార్‌ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చెక్‌పోస్ట్‌ వద్ద ఉన్న సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి.