తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ను ఢీకొట్టిన లారీ.
- నలుగురికి గాయాలు.. దంపతుల పరిస్థితి విషమం.
- పాదయాత్రలో ముందుకు సాగుతున్న మల్లన్నకు తప్పిన ప్రమాదం.
జనం వాయిస్, యాదాద్రి భువనగిరి, నవంబర్ 13:
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామం వద్ద తీన్మార్ మల్లన్న పాదయాత్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ మల్లన్న కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారును బలంగా ఢీకొట్టడంతో నాలుగురికి గాయాలయ్యాయి. వారిలో భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మోత్కూరు నుంచి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు తీన్మార్ మల్లన్న పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో చౌటుప్పల్ మండలం జై కేసారానికి చెందిన లారీ (టీఎస్ 30 టీ 7596) వెనుక నుంచి వచ్చి కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారు (టీఎస్ 30 ఎల్ 444)ను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన ఫార్చునర్ ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో మరో కారులో ప్రయాణిస్తున్న తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్, ఆయన భార్య చందన, రెండేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ సురేష్‌కు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మల్లన్న ఫార్చునర్ కారులో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడినట్లు సమాచారం. లారీ ఢీకొట్టిన తీవ్రతకు ఫార్చునర్ కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో తీన్మార్ మల్లన్న కారులో కాకుండా కాలినడకన పాదయాత్రలో ముందుకు సాగుతుండటంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.

