janamvoice.com
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 1:39 pm Digital Edition : JANAM VOICE

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

  • తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తీవ్ర చలిగాలులు.
  • కొన్ని జిల్లాల్లో 12 డిగ్రీల వరకు పడిపోనున్న రాత్రి ఉష్ణోగ్రతలు.
  • ఈశాన్య దిశ నుంచి వీస్తున్న శీతల గాలులే ఉష్ణోగ్రతల పతనానికి కారణం.

జనం వాయిస్, తెలంగాణ, నవంబర్ 10:

తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండటంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 29 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం… జోగులాంబ గద్వాల, ఖమ్మం, సూర్యాపేట, జనగామ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని, అక్కడ ఉష్ణోగ్రతలు దాదాపు 12 డిగ్రీల వరకు పడిపోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలోని నేరెడుగొండలో అత్యల్పంగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.

దేశంలోని ఈశాన్య ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న చల్లని గాలుల ప్రభావం వల్లే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మూడు రోజుల పాటు తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశముంది. దీనివల్ల దృశ్యమానత (విజిబిలిటీ) తగ్గి రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అటవీ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులు ఉదయం వేళల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.