janamvoice.com
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 9:04 am Digital Edition : JANAM VOICE

13 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి.. విడిపోతున్నట్టు ప్రకటించిన పవన్ కళ్యాణ్, లెజినోవా

13 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి.. విడిపోతున్నట్టు ప్రకటించిన పవన్ కళ్యాణ్, లెజినోవా

  • పవన్ కల్యాణ్, లెజినోవో విడిపోతున్నట్లు ఉమ్మడి ప్రకటన.
  • పరస్పర గౌరవంతో విడిపోతున్నామని వెల్లడి.
  • పిల్లలకు బాధ్యతాయుత తల్లిదండ్రులుగా ఉంటామన్న జంట.
  • 13 ఏళ్ల క్రితం ‘తీన్ మార్’ సినిమా సమయంలో పరిచయం.
  • తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి.

జనం వాయిస్, ఆంధ్రప్రదేశ్, నవంబర్ 10:

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజినోవా తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. 13 ఏళ్ల తమ వివాహ బంధాన్ని పరస్పర అవగాహన, గౌరవంతో ముగించాలని నిర్ణయించుకున్నట్లు సోమవారం రాత్రి ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. జనసేన అధికారిక మీడియా గ్రూప్ ద్వారా ఈ ప్రకటన వెలువడింది. “మా జీవితంలో ఎంతో ముఖ్యమైన సమయాన్ని కలిసి గడిపిన తర్వాత పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా వైవాహిక జీవితం ముగిసినా, మేం మంచి స్నేహితులుగా ఉంటాం. మా చక్కని పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతాం” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పిల్లల సంతోషం, శ్రేయస్సే తమకు ఎల్లప్పుడూ ప్రాధాన్యమని, ఈ సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని వారు కోరారు. రష్యన్ జాతీయురాలైన అన్నా లెజినోవాను పవన్ కల్యాణ్ 2011లో ‘తీన్ మార్’ సినిమా చిత్రీకరణ సమయంలో కలిశారు. రెండేళ్ల తర్వాత, 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో ప్రత్యేక వివాహ చట్టం కింద వీరి వివాహం జరిగింది. వీరికి కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు. పవన్ కల్యాణ్‌కు ఇది మూడో వివాహం. గతంలో ఆయన 1997లో నందినిని వివాహం చేసుకొని 2008లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి రేణు దేశాయ్‌ను 2009లో వివాహం చేసుకొని 2012లో విడిపోయారు. రేణు దేశాయ్‌తో పవన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే జనసేన వర్గాలు దీనిని ధ్రువీకరించాయి. అయితే, ఈ అంశంపై మరింతగా స్పందించేందుకు నిరాకరించాయి. కొన్ని నెలలుగా వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.