ఎట్టకేలకు రిటైర్డ్ బొగ్గు గని కార్మికుల ఖాతాల్లో పెన్షన్ జమ.
- పెన్షనర్ల ఆందోళనకు తెర.. సమస్య పరిష్కారంపై హర్షం.
- కృషి చేసిన సీఎంపీఎఫ్ అధికారులకు, విలేకరులకు, కార్మిక సంఘ నాయకులకు కృతజ్ఞతలు.
జనం వాయిస్, గోదావరిఖని, నవంబర్ 09:
ఎట్టకేలకు సింగరేణి రిటైర్డ్ బొగ్గు గని కార్మికుల ఎదురుచూపులకు తెరపడింది. నవంబర్ నెలకు సంబంధించిన కోల్ మైన్స్ పెన్షన్ ఆలస్యంగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది. ప్రతి నెల ఒకటో తేదీన జమ కావాల్సిన పెన్షన్ నవంబర్ నెలలో ఆలస్యం కావడంతో వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ మినహా ఇతర జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన పలువురు పెన్షనర్లకు నవంబర్ ఐదో తేదీ వరకు కూడా పెన్షన్ జమ కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో పండుగను ఎలా జరుపుకోవాలనే ఆందోళన వారిలో నెలకొంది. ఈ సమస్యపై సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు వివిధ దినపత్రికల ద్వారా తమ ఆవేదనను వెలుగులోకి తీసుకువచ్చారు. స్థానిక సీఎంపీఎఫ్ అధికారులకు విజ్ఞప్తులు చేస్తూ పెన్షన్ ఆలస్యానికి గల కారణాలను పరిశీలించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. పెన్షనర్ల ఆవేదనను పత్రికలు ప్రచురించడంతో అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. ఎట్టకేలకు నవంబర్ 7వ తేదీ నాటికి పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ జమ కావడంతో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తూ సమాచార సందేశాలను పంపుకున్నారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన స్థానిక సీఎంపీఎఫ్ అధికారులకు, పెన్షనర్ల సమస్యను తమ వార్తల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వివిధ దినపత్రికల విలేకరులకు, సహకరించిన కార్మిక సంఘ నాయకులకు సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఆలస్యం పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు, బ్యాంకులు సమన్వయంతో పనిచేసి ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ పెన్షనర్ల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.