janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 2:21 pm Digital Edition : JANAM VOICE

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన కీసర ఎస్సై

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన కీసర ఎస్సై.

  • చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఎస్సై.
  • బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగి ట్రాప్ వేసిన ఏసీబీ అధికారులు.
  • లంచం డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సబ్ ఇన్‌స్పెక్టర్.

జనం వాయిస్, కీసర, నవంబర్ 9:

హైదరాబాద్ లోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కేసుకు సంబంధించి చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి బాధితుడి నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసుకు సంబంధించి చార్జ్‌షీట్ వేయాలని బాధితుడు ఎస్సై శ్రీనివాస్‌ను కోరారు. ఇందుకు ప్రతిఫలంగా ఎస్సై రూ.2 లక్షల నగదు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం ఇవ్వలేకపోయిన బాధితుడు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. ఈ ఉదయం శిల్పా నగర్ వద్ద బాధితుడి నుంచి ఎస్సై శ్రీనివాస్ రూ.2 లక్షల నగదును లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ బృందం ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆయన వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ చేపట్టారు. కీసర పోలీస్ స్టేషన్‌లో కొద్ది నెలల వ్యవధిలోనే ఇలాంటి అవినీతి ఘటన మరోసారి వెలుగుచూడటం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలోనూ స్టేషన్ బెయిల్ కోసం రూ.5 లక్షలు డిమాండ్ చేస్తూ ఇక్కడి ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తాజాగా మరో ఎస్సై లంచం తీసుకుంటూ దొరికిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. పట్టుబడిన ఎస్సై శ్రీనివాస్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.