janamvoice.com
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 9:32 am Digital Edition : JANAM VOICE

సెంటినరీ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.

సెంటినరీ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.

  • నలుగురు అరెస్ట్.. రూ.18,650 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం.

జనం వాయిస్, రామగిరి, నవంబర్ 11:

సెంటినరీ కాలనీలో అక్రమ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్, రామగిరి పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.18,650 నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంటినరీ కాలనీలో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ ఆదేశాలతో నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ దాడి చేపట్టారు. టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దీకొండ రమేష్, రామగిరి ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మట్టా ప్రశాంత్ (40), దొంతరవేణి సదానందం (37), ఎస్.కె. చాంద్ పాషా (30), పూర్ట కార్తీక్ (30) ఉన్నారు. వీరిలో మొదటి ఇద్దరు సింగరేణి ఉద్యోగులు కాగా, మిగిలిన ఇద్దరు కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రశాంత్, సదానందం సెంటినరీ కాలనీకి చెందినవారు కాగా, చాంద్ పాషా, కార్తీక్ బేగంపేట ఎక్స్‌రోడ్‌కు చెందినవారు. ఈ ఘటనలో బేగంపేట ఎక్స్‌రోడ్‌కు చెందిన మైలారపు అనిల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నలుగురితో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం రామగిరి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. అక్రమంగా పేకాట ఆడినా, నిర్వహించినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.