janamvoice.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 2:09 pm Digital Edition : JANAM VOICE

బీర్ బాటిల్‌లో చేపపిల్ల..మల్లాపూర్‌లో కలకలం.

బీర్ బాటిల్‌లో చేపపిల్ల..మల్లాపూర్‌లో కలకలం.

బీర్ తెరిచిన కస్టమర్‌కు షాక్.

బాటిల్‌లో ఈదుతున్న చేపపిల్ల దర్శనం.

సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో.

జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 07:

బీర్ తాగేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. కొనుగోలు చేసిన బీర్ బాటిల్‌ను తెరిచిన వెంటనే అందులో ఒక చేపపిల్ల ఈదుతూ కనిపించడంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. హైదరాబాద్ నగరంలోని నాచారం పరిధి మల్లాపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుని స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం మల్లాపూర్‌లో ఉన్న జేపీ వైన్ షాపులో శుక్రవారం ఓ వ్యక్తి కింగ్‌ఫిషర్ లైట్ బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అనంతరం బీర్ తాగేందుకు బాటిల్ మూతను తెరిచాడు. అయితే బాటిల్‌ను తెరిచిన వెంటనే అందులో ఒక చిన్న చేపపిల్ల కదులుతూ కనిపించడంతో అతను ఆశ్చర్యానికి గురయ్యాడు. బీర్ బాటిల్‌లో చేప ఎలా వచ్చిందనే విషయంపై అక్కడ ఉన్నవారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై వెంటనే కస్టమర్ వైన్ షాపు నిర్వాహకులను ప్రశ్నించాడు. అయితే దీనిపై వారు నిర్లక్ష్యంగా స్పందించినట్లు సమాచారం. బీర్ తయారీ తమది కాదని, ఏదైనా సమస్య ఉంటే తయారీ సంస్థను సంప్రదించాలని చెప్పి కస్టమర్‌తో దురుసుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు వాగ్వాదం కూడా చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి బీర్ బాటిల్‌లో కదులుతున్న చేపపిల్లను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆహార భద్రత, నాణ్యతపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.