janamvoice.com
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 7:44 pm Digital Edition : JANAM VOICE

25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన మిత్రుడు.

25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన మిత్రుడు.

– కేరళ నుంచి జగిత్యాలకు ప్రత్యేక ప్రయాణం.
– గూగుల్ సాయంతో స్నేహితుడి ఇంటి గుర్తింపు.
– నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఘటన.

జనం వాయిస్, జగిత్యాల, జూలై 11:

పాతికేళ్ల క్రితం తీసుకున్న రూ.25 వేల అప్పును తీర్చేందుకు కేరళ నుంచి వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి జగిత్యాల జిల్లాకు వచ్చిన వ్యక్తి నిజాయితీ అందరినీ ఆకట్టుకుంది. స్నేహం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది.
సమాచారం ప్రకారం, మహ్మద్ ఇస్మాయిల్, ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న గతంలో సౌదీ అరేబియాలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో అత్యవసర అవసరం కోసం ఇస్మాయిల్ లచ్చన్న వద్ద రూ.25 వేల అప్పు తీసుకున్నాడు. అనంతరం ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో పరస్పర సంబంధాలు తెగిపోయాయి. అయితే అప్పు తీర్చాలనే సంకల్పంతో ఇస్మాయిల్ కేరళ నుంచి జగిత్యాల జిల్లాకు చేరుకున్నాడు. లచ్చన్న చిరునామా, ఫోన్ నంబర్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్, స్థానికుల సహాయంతో ఆయన ఇంటిని గుర్తించాడు.
ప్రస్తుతం లచ్చన్న గల్ఫ్ దేశంలో ఉండటంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడిన ఇస్మాయిల్, తీసుకున్న రూ.25 వేల అప్పును కుటుంబ సభ్యులకు అందజేశాడు. ఇన్నేళ్ల తర్వాత కూడా మాట నిలబెట్టుకుని అప్పు తీర్చిన తన మిత్రుడి నిజాయితీని లచ్చన్న అభినందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన సమాజంలో ఇప్పటికీ నిజాయితీ, మానవత్వం, స్నేహానికి విలువ ఉందని చాటిచెప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఇస్మాయిల్ చేసిన ఈ పని పలువురికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడుతున్నారు.