janamvoice.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 11:37 pm Digital Edition : GATTU MAHESH

అంబులెన్స్ లేని ఆస్పత్రి – చెత్త రిక్షాలో మృతదేహం.

అంబులెన్స్ లేని ఆస్పత్రి – చెత్త రిక్షాలో మృతదేహం.

-మన్యం జిల్లాలో కలచివేసిన అమానవీయ ఘటన.
-ప్రభుత్వ వైద్య సదుపాయాలపై విమర్శలు.
-ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసు చలించిపోయింది.

జనం వాయిస్, వెబ్ డెస్క్:

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య వ్యవస్థ వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే హృదయవిదారక ఘటన మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. నిరుపేద వృద్ధ మహిళ మృతిచెందితే… ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస అంబులెన్స్ సౌకర్యం కూడా లేకపోవడంతో చెత్త సేకరణ రిక్షాలో శ్మశాన వాటికకు తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి, రాజకీయ దుమారానికి కారణమైంది. మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన రాధమ్మ (65) జీవితాంతం పేదరికంతో పోరాడుతూ జీవించారు. భర్త, కూతురు కొన్నేళ్ల కిందటే మృతి చెందడంతో ఒంటరిగా బతుకుతున్న ఆమె ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బంధువులు ఆమెను భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచారు.
అసలు విషాదం అక్కడితో ఆగలేదు. రాధమ్మ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆస్పత్రిలో అంబులెన్స్ లేదని చెప్పడంతో కుటుంబసభ్యులు ప్రైవేట్ వాహనాన్ని ఆశ్రయించారు. అయితే రూ.2,500 ఖర్చవుతుందని చెప్పడంతో, అంత మొత్తం చెల్లించే స్తోమత లేక చివరకు చెత్త తరలించే రిక్షాబండిలోనే మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసు చలించిపోయింది. పేదరికం చావు వరకూ వెంటాడిందన్నట్లుగా… చివరి ప్రయాణంలో కూడా రాధమ్మకు గౌరవం దక్కలేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాల కోసం కనీస అంబులెన్స్ సౌకర్యం లేకపోవడమేంటి? పేదలకు ఉచిత వైద్యం, మానవీయ గౌరవం ఎక్కడ? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీ అంతటా మార్మోగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటోంది. “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం” అని చెప్పుకునే పాలన… ఒక నిరుపేద మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ కూడా ఇవ్వలేకపోయిందని ప్రజలు మండిపడుతున్నారు. ఇది కేవలం ఒక ఘటన కాదని, గ్రామీణ వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలకు ప్రతిబింబమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పేదల జీవితాలకు, వారి మరణానికీ గౌరవం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాధమ్మ చివరి ప్రయాణం… పాలకుల మానవీయ వైఫల్యానికి చేదు గుర్తుగా మిగిలిపోయింది.