janamvoice.com
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 5:10 pm Digital Edition : JANAM VOICE

త్వరలో బీజేపీలో కీలక పదవి.. బండి సంజయ్ నోట ఆసక్తికర మాటలు!

త్వరలో బీజేపీలో కీలక పదవి.. బండి సంజయ్ నోట ఆసక్తికర మాటలు!

  • బీజేపీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్న కేంద్ర మంత్రి.
  • ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తానని వ్యాఖ్య.
  • పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని వెల్లడి.
  • కేసీఆర్ భూ వివాదాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్రామాలని విమర్శ.
  • ‘ఓట్ చోరీ, సీట్ చోరీ’ పేటెంట్ కాంగ్రెస్‌కే ఉందని ఆరోపణ.

జనం వాయిస్, కరీంనగర్, అక్టోబర్ 7:

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు త్వరలో తెలంగాణ బీజేపీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తనకు ఎన్నో పదవులు, అవకాశాలు ఇచ్చిందని చెప్పారు. తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తానని, కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని బీజేపీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ‘సేవా జ్యోతి’ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్ భూ వివాదాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పడం అంతా డ్రామానేనని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై పోరాడే సత్తా బీఆర్ఎస్‌కు లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు.

ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న విమర్శలపై బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. ‘ఓట్ చోరీ, సీట్ చోరీ’ పేటెంట్ కాంగ్రెస్‌కే ఉందని ఆరోపించారు. 1946లో కాంగ్రెస్ పీసీసీలన్నీ సర్దార్ పటేల్ ప్రధాని కావాలని ప్రతిపాదించినా.. నెహ్రూను ప్రధాని చేశారని విమర్శించారు. దేశంలో బోగస్ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్సే చెప్పిందని, ఇప్పుడు వాటిని తొలగిస్తుంటే ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు.

ప్రధాని మోదీకి ఓటు, సీటు చోరీ చేయాల్సిన అవసరం లేదన్నారు. కుటుంబం, బినామీ ఆస్తులు, వారసత్వ రాజకీయాలు ఆయనకు అవసరం లేదని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు చెప్పే మాటలు నమ్మి యువత మోసపోవద్దని బండి సంజయ్ సూచించారు. 2014కు ముందు, ఇప్పటి భారత్‌ను పోల్చి చూడాలని కోరారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అని, అది బీజేపీ జేబు సంస్థ కాదన్నారు. రాజ్యాంగ సంస్థను బదనాం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు.

ఎన్నికల సంఘాన్ని కలవాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోవాలని రాహుల్ గాంధీకి సూచించారు. వందల మందితో వెళ్లి దాడి చేస్తే పోలీసులు అడ్డుకోక ఏం చేస్తారని ప్రశ్నించారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యమన్నారు.

తెలంగాణలో అక్రమ చొరబాటుదారుల ఓట్లపై కూడా బండి సంజయ్ ఆరోపణలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోనే 30 వేలకు పైగా రోహింగ్యాల ఓట్లు ఉన్నాయని అన్నారు.