janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 6:57 pm Digital Edition : JANAM VOICE

కడుపు కోసుకొని బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.

  • కడుపు కోసుకొని బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.
  • అమ్మ అనే పిలుపు కోసం మహిళా తపన.
  • ప్రసవ వేదనతో గర్భిణీ దారుణ నిర్ణయం.
  • ఆసుపత్రికి తీసుకెళ్లే వారు లేక ఒంటరితనం.
  • కడుపు కోసుకుని బిడ్డకు జన్మనిచ్చిన ఘటన.
  • తల్లి పరిస్థితి విషమం.
  • జనం వాయిస్, వెబ్ డెస్క్:
  • ‘అమ్మా’ అనే పిలుపు కోసం ఓ మహిళ పడే తపన ఎంత గొప్పదో మరోసారి గుర్తు చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆసుపత్రికి తీసుకెళ్లే వారు లేక, ప్రసవ వేదనను తట్టుకోలేక ఓ గర్భిణీ తన పొత్తికడుపును కత్తితో కోసుకున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తీవ్రమైన నొప్పి, ఒంటరితనం కలిసి ఆమెను ఆవేదనతో కూడిన నిర్ణయానికి నెట్టాయని స్థానికులు చెబుతున్నారు. నంద్వాల్ గ్రామానికి చెందిన నంకై అనే మహిళ గత ఆరు నెలలుగా కష్టాల్లోనే జీవనం సాగిస్తోంది. అనారోగ్యంతో భర్త మృతి చెందడంతో ఆమె ఒంటరిగానే గర్భధారణ కాలాన్ని పూర్తి చేసింది. నెలలు నిండిన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. సహాయం కోసం ఆమె పలుమార్లు కేకలు వేసినా ఎవరూ స్పందించలేదని గ్రామస్థులు తెలిపారు. నొప్పులు మరింత తీవ్రమవుతుండడంతో ఆ బాధను భరించలేక ఆమె వంటింట్లో ఉన్న కూరగాయల కత్తితో తన పొత్తికడుపును కోసుకుందని సమాచారం.ఆమె ఆర్తనాదాలు విన్న గ్రామస్థులు పరుగెత్తుకుని వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో పడిఉన్న నంకైను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. కడుపు కోసుకోవడంతో అంతర్గత అవయవాలు బయటకు వచ్చిన పరిస్థితిలో వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, తీవ్ర రక్తస్రావం కారణంగా తల్లి పరిస్థితి విషమంగా మారింది. జిల్లా ఆసుపత్రికి తరలించిన తర్వాత గాయాల తీవ్రతను చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గాయం లోతుగా ఉండటంతో పాటు అధిక రక్తస్రావం జరిగిందని వైద్య వర్గాలు తెలిపాయి. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను లక్నో నగరంలోని ఉన్నత వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతున్నట్లు సమాచారం. ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల లోపంపై మరొకసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.