అమ్మ చూపు సజీవం.. నేత్రదానంతో ఆదర్శంగా నిలిచిన కుటుంబ సభ్యులు.
- రాజేశ్వరి మృతిపై కాంగ్రెస్ కార్పొరేటర్ల నివాళులు.
- నేత్రదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులకు అభినందనలు.
జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 30:
మరణానంతరం కూడా తమ తల్లి చూపు మరొకరికి వెలుగునివ్వాలనే గొప్ప సంకల్పంతో నేత్రదానానికి ముందుకొచ్చి ఓ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ మాజీ అధ్యక్షుడు నంది వెంకటేష్ తల్లి రాజేశ్వరి (51) అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు. తల్లి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో ఆమె నేత్రాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో శుక్రవారం నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షుడు బొంతల రాజేష్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ ఎండీ ముస్తఫా, కార్పొరేటర్ గట్ల రమేష్ రాజేశ్వరి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్రదానం మహోన్నతమైన పుణ్యకార్యమని, మరణానంతరం కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపేందుకు అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. తీవ్ర విషాదంలోనూ నేత్రదానానికి ముందుకొచ్చిన రాజేశ్వరి కుటుంబ సభ్యులను అభినందించారు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.