janamvoice.com
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 10:50 pm Digital Edition : GATTU MAHESH

రికార్డు సృష్టించిన స్మృతి.

రికార్డు సృష్టించిన స్మృతి.

జనం వాయిస్, విశాఖపట్నం, డిసెంబర్ 22:

విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాటు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన 48 రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన స్మృతి, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించింది.టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 4000 పరుగులు పూర్తి చేసిన రెండవ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 25 పరుగులు చేసిన ఆమె ఈ ఘనతను సాధించింది. ఇప్పటివరకు 154 మ్యాచ్‌లు ఆడిన స్మృతి మొత్తం 4007 పరుగులు చేసింది. ఈ ప్రయాణంలో ఆమె ఒక శతకం, 31 అర్ధ శతకాలను నమోదు చేసింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ 4716 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
టీ20 క్రికెట్ చరిత్రలో పురుషులు, మహిళలు కలిపి కేవలం ఐదుగురు మాత్రమే 4000కు పైగా పరుగులు సాధించగలిగారు. ఈ జాబితాలో భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్, పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజం ఉన్నారు. తాజాగా స్మృతి మంధాన కూడా ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో చేరింది. అంతేకాదు, వీరిలో అతి పిన్న వయస్కురాలిగా స్మృతి నిలవడం విశేషం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆమె ఈ రికార్డు జాబితాలో అగ్రస్థానాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.