janamvoice.com
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 4:29 pm Digital Edition : GATTU MAHESH

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

స్కూలు బస్సును ఢీకొట్టిన లారీ.
ఏడుగురు విద్యార్థులకు గాయాలు.
రహదారిపై స్తంభించిన వాహన రాకపోకలు.

జనం వాయిస్, చిత్తూరు జిల్లా:

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరామపురం సమీపంలోని బీసీ కాలనీ వద్ద విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూలు బస్సును వెనుక నుంచి ఒక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడగా, ఒక విద్యార్థికి నాలుక తెగిపోయినట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కొన్ని గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకుని జీడీనెల్లూరు వైపు స్కూలు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రతకు బస్సు వెనుక భాగం దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన ఏడుగురు విద్యార్థుల్లో కొందరికి తీవ్ర గాయాలు కాగా, ఒక విద్యార్థికి నాలుక తెగిపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా చిత్తూరు–పుత్తూరు రహదారిపై వాహన రాకపోకలు కొంతసేపు పూర్తిగా స్తంభించిపోయాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. స్కూలు బస్సుల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.