janamvoice.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 9:15 am Digital Edition : GATTU MAHESH

విధులకు గైర్హాజరు.. ఎన్నికల ప్రచారం – కానిస్టేబుల్ సస్పెన్షన్.

విధులకు గైర్హాజరు.. ఎన్నికల ప్రచారం – కానిస్టేబుల్ సస్పెన్షన్

చేర్యాల మున్సిపల్ ఎన్నికల వ్యవహారం.
ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై చర్య.
భార్య గీతాంజలి నిరసన.

జనం వాయిస్, సిద్దిపేట:

ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతూ, చేర్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న తన భార్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలతో రుజువుకావడంతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కె. రమేశ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పోలీసు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నట్లు సీపీ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. చేర్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కానిస్టేబుల్ రమేశ్ తన విధులకు హాజరుకాకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పోలీసు శాఖకు సమాచారం అందింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, ఆయన తన భార్య అభ్యర్థిత్వానికి మద్దతుగా ప్రచారం చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల కింద ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం వెలుగులోకి రాగానే రమేశ్ భార్య, చేర్యాల మున్సిపాలిటీ రెండో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కమలాపురం గీతాంజలి నిరసనకు దిగారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన ఆమె, అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికార యంత్రాంగం అన్యాయంగా వ్యవహరించిందని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ, తమ ప్రత్యర్థికి ఓటమి భయం పట్టుకోవడంతో అధికార బలాన్ని ఉపయోగించి తన భర్తను సస్పెండ్ చేయించారని ఆరోపించారు. తాను నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచే పలు ప్రలోభాలు చూపించి పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని, వాటిని అంగీకరించకపోవడంతో చివరకు కక్షపూరితంగా ఈ చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ ఘటన చేర్యాల మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.