వికారాబాద్‌లో లంచం కేసు: అవినీతి నిరోధక శాఖ అదుపులో ముగ్గురు.
-సేవల కోసం డబ్బు డిమాండ్ చేసినట్లు ఆరోపణ.
-పౌరులు భయపడకుండా ఫిర్యాదు చేయాలని పిలుపు.
జనం వాయిస్,వికారాబాద్:
వికారాబాద్ జిల్లా తాండూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇన్‌చార్జ్ సబ్‌రిజిస్ట్రార్ మరియు జూనియర్ అసిస్టెంట్ సాయి కుమార్‌తో కలిసి, దస్తావేజు లేఖకుడు డి.సాయికుమార్, సహాయక దస్తావేజు లేఖకుడు డి.అశోక్ లను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారునికి సంబంధించిన 11 ప్లాట్లలో 4 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వాటి దస్తావేజులను ఇవ్వడం, మిగిలిన 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పత్రాలు అప్పగించేందుకు డబ్బు తీసుకున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉచ్చు పన్ని, లంచం తీసుకుంటున్న సమయంలో ముగ్గురినీ పట్టుకున్నారు. ప్రజలకు అందాల్సిన రిజిస్ట్రేషన్ సేవలను డబ్బు కోసం నిరోధించడం ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న అవినీతి పరిస్థితిని ప్రతిబింబిస్తున్నదని స్థానికులు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లంచం అడిగే ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులను స్వీకరించనున్నామని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని శాఖ హామీ ఇచ్చింది. ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తేనే ప్రభుత్వ వ్యవస్థల్లోని అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. చిన్న చిన్న లంచం ఘటనలపై కూడా చర్యలు తీసుకోవడం ద్వారా పారదర్శక సేవల అందుబాటు పెరుగుతుందని, ప్రభుత్వ సేవలు మరింత శుభ్రంగా మారతాయని వారు పేర్కొన్నారు.