సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలవాల్సిన జర్నలిజం వృత్తి నేడు కొందరి స్వార్థం వల్ల కళంకితమవుతోంది. నూతన అక్రిడేషన్ కార్డుల ప్రక్రియ మొదలవడంతో, కొన్ని మీడియా సంస్థలు పత్రికా విలువలను గాలికొదిలేసి ‘లెటర్ల దందా’కు తెరలేపాయి. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు దక్కాల్సిన గుర్తింపు కార్డులు, నేడు కాసుల కక్కుర్తితో అనర్హుల జేబుల్లోకి చేరుతున్నాయి.
బేరానికి లెటర్ హెడ్లు..!
జర్నలిజంలో ఓనమాలు తెలియని వారు సైతం కార్డుల కోసం వేల రూపాయలు కుమ్మరిస్తున్నారు. జిల్లా స్థాయి అక్రిడేషన్ లెటర్ కోసం రూ. 40 వేలు, మండల స్థాయి కోసం రూ. 20 వేల నుండి రూ. 30 వేల వరకు రేటు ఫిక్స్ చేసి బహిరంగంగానే లెటర్లను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెంట్లకు ఉచితంగా ఇస్తూ, అక్రమ వ్యాపారుల వద్ద అందినకాడికి దండుకుంటున్నాయి కొన్ని సంస్థలు.
అర్హులెవరు..? అనర్హులెవరు..?
సంవత్సరాల తరబడి క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న నిజమైన జర్నలిస్టులకు అక్రిడేషన్ దక్కడం గగనంగా మారుతోంది. కానీ, హోటల్ యజమానులు, ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవారు, నేరచరిత్ర ఉన్నవారు సైతం చేతిలో డబ్బులు ఉంటే చాలు ‘జర్నలిస్టు’ అవతారమెత్తుతున్నారు. కనీసం ఒక్క వార్త కూడా రాయలేని వారు అక్రిడేషన్ కార్డులను అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించడం, సెటిల్మెంట్లు చేయడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు.
పరిశీలిస్తే అసలు రంగు బయటపడుతుంది..,
ఏ సంస్థ నుండి అయితే అక్రిడేషన్ లెటర్లు జారీ అయ్యాయో, ఆ సంస్థలో కనీసం ఏడాది పాటు సదరు వ్యక్తులు రాసిన వార్తలు లేదా ప్రచురితమైన పేపర్ క్లిప్పింగులను క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడతాయి. అధికారులు కేవలం లెటర్ల ఆధారంగా కాకుండా, వారి పనితీరును బట్టి కార్డులు జారీ చేస్తేనే నిజమైన జర్నలిస్టులకు న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన జర్నలిజం ముసుగులో జరుగుతున్న ఈ లెటర్ల దందాను అరికట్టాలని, అక్రమార్కుల ఆట కట్టించాలని సీనియర్ జర్నలిస్టులు, మేధావులు కోరుతున్నారు.