రూ.26 వేలకే కారు అంటూ ప్రకటన.. చివరకు దుకాణం ధ్వంసం.
– గణతంత్ర దినోత్సవ ఆఫర్ పేరిట ప్రకటన.
– పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాలు.
– కార్లు లేవని చెప్పడంతో ఆగ్రహం.
– వ్యాపారిపై కేసు నమోదు.
జనం వాయిస్, హైదరాబాద్:
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.26 వేలకే కారు విక్రయిస్తానని ప్రకటించిన ఓ పాత కార్ల వ్యాపారి చివరకు చేతులెత్తేశాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వ్యాపారి మోసం చేశాడని గ్రహించిన జనాలు ఆగ్రహంతో అతడి దుకాణాన్ని ధ్వంసం చేశారు.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మల్లాపూర్‌కు చెందిన రోషన్ గణతంత్ర దినోత్సవ ప్రత్యేక ఆఫర్‌గా రూ.26 వేలకే కార్లు విక్రయిస్తానని సామాజిక మాధ్యమాల్లో ప్రకటన ఇచ్చాడు. తన వద్ద ఉన్న 50 కార్లను ఇదే ధరకు అమ్ముతానని పేర్కొనడంతో ఈ సమాచారం వేగంగా వ్యాపించింది. దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు అతడు నిర్వహిస్తున్న దుకాణం వద్దకు చేరుకున్నారు. అయితే వ్యాపారి చాలాసేపటి వరకు అక్కడకు రాకపోవడంతో వచ్చిన వారు ఆగ్రహానికి గురయ్యారు. తర్వాత అక్కడకు వచ్చిన రోషన్ తన వద్ద కేవలం 10 కార్లు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు అక్కడ ఉన్న కార్లపై రాళ్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వ్యాపారిపై కేసు నమోదు చేసి నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.