పాక్ గగనతలంలోకి ప్రవేశించిన ఎయిర్ ఇండియా విమానం..
జనం వాయిస్, న్యూఢిల్లీ, జూన్ 24:
ఢిల్లీ నుంచి అమృత్‌సర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సోమవారం రాత్రి అనుకోకుండా పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా దర్యాప్తు ప్రారంభించింది. సమాచారం ప్రకారం, రాత్రి 9.18 గంటలకు ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన ఆ విమానం 10.30 గంటలకు అమృత్‌సర్ చేరుకోవాల్సి ఉండగా, మార్గమధ్యంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విమానం కొద్ది సెకన్ల పాటు పాకిస్థాన్ వైమానిక పరిధిలోకి ప్రవేశించింది. వెంటనే పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ అధికారులు పైలట్‌కు హెచ్చరిక సందేశాలు పంపినట్లు సమాచారం. పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అమృత్‌సర్ విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సాంకేతిక లోపం కారణంగా విమానం తిరిగి ఢిల్లీకి మళ్లించబడింది. అనంతరం రెండు గంటల తర్వాత మళ్లీ టేకాఫ్ తీసుకుని రాత్రి 2.20 గంటలకు అమృత్‌సర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాశ్రయ డైరెక్టర్ భూపేందర్ సింగ్ తెలిపిన ప్రకారం, విమానం పాకిస్థాన్ గగనతలంలో చాలా స్వల్ప దూరం మాత్రమే ప్రయాణించిందని, పెద్ద స్థాయిలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. ఈ ఘటన రెండు దేశాల మధ్య గగనతల భద్రతా అంశంపై మళ్లీ చర్చకు దారితీసింది.