వాంకోవర్ విమానాశ్రయంలో మద్యం మత్తులో ఎయిర్ ఇండియా పైలట్.
-విమానం ప్రారంభానికి ముందే గుర్తించిన అధికారులు.
-కెనడా పోలీసుల చర్యలు… డీజీసీఏకు సమాచారం.
-దర్యాప్తు పూర్తయ్యే వరకు విధుల నుంచి తొలగింపు.
జనం వాయిస్, వాంకోవర్, జనవరి 01:
కెనడాలోని వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మద్యం సేవించిన స్థితిలో ఉన్న ఎయిర్ ఇండియా పైలట్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 23, 2025న వాంకోవర్ నుంచి ఢిల్లీకి వియన్నా మీదుగా వెళ్లాల్సిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం బయలుదేరే ముందు పైలట్ శ్వాసలో మద్యం వాసన రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, వాంకోవర్ డ్యూటీ-ఫ్రీ స్టోర్‌లోని ఒక ఉద్యోగి పైలట్ మద్యం సేవిస్తున్నట్టు గమనించాడు. బాటిల్ కొనుగోలు సమయంలో అతని శ్వాసలో మద్యం వాసన రావడంతో వెంటనే ఈ విషయాన్ని కెనడియన్ అధికారులకు తెలియజేశాడు. విమానానికి ముందు జరిగే తనిఖీల్లో పైలట్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అతన్ని ప్రశ్నల కోసం నిర్భందించారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా కఠిన వైఖరి తీసుకుంది. పైలట్‌ను ఢిల్లీకి తీసుకొచ్చి అంతర్గతంగా విచారణ చేపట్టినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు కూడా తెలియజేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు సంబంధిత పైలట్‌ను విమాన విధుల నుంచి తొలగించినట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించి కెనడియన్ అధికారులతో పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పైలట్ కదలికలను గుర్తించిన అధికారులు, అతన్ని విమానం వరకు అనుసరించినట్లు సమాచారం. నిజంగా ఏ పరిస్థితుల్లో పైలట్ మద్యం సేవించాడన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.