వర్షాల వేళ అప్రమత్తతే ప్రాణరక్షణ.
• భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
• సీఐ వై. సుధాకర్ రెడ్డి.
జనం వాయిస్, శాయంపేట, జూలై 30:
శాయంపేట మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని శాయంపేట సీఐ వై. సుధాకర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, వర్షాల సమయంలో నిర్లక్ష్యం ప్రాణాపాయాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మట్టి గోడల ఇళ్లలో నివసించే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, గతంలో మండలంలో చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, రైతులు తడి చేతులతో విద్యుత్ మోటార్లను ఆన్ లేదా ఆఫ్ చేయవద్దని తెలిపారు. విద్యుత్ లీకేజీ అనుమానం ఉన్న పరికరాలను వినియోగించకుండా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలను దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్–100కు లేదా శాయంపేట సీఐ 8712685226 మొబైల్ నంబర్‌కు సమాచారం అందించి పోలీసుల సహాయం పొందాలని సీఐ వై. సుధాకర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.