అమెజాన్‌లో 850 మందికి ఉద్యోగాలు.
జనం వాయిస్, విశాఖపట్నం, డిసెంబర్ 25:
విశాఖపట్నంలో అమెజాన్ సంస్థ తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. పెందుర్తి ప్రాంతంలో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా ప్రస్తుతం సుమారు 300 మంది ఉద్యోగులతో సంస్థ పని చేస్తోంది. వర్క్ ఫ్రం హోమ్ విధానంలో సేవలు అందిస్తున్న ఈ కేంద్రాన్ని మరింత విస్తరించాలనే నిర్ణయానికి అమెజాన్ వచ్చింది.
తాజా విస్తరణ ప్రణాళికలలో భాగంగా రాబోయే మూడు సంవత్సరాల్లో మరో 533 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. దీంతో విశాఖలో అమెజాన్‌లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య మొత్తం 833కి చేరనుంది. దీనికోసం అవసరమైన పెట్టుబడిని కూడా రెట్టింపు చేయాలని సంస్థ భావిస్తోంది. ఈ నిర్ణయం విశాఖను ఒక కీలక టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేయడంలో కీలకంగా మారనుందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ–కామర్స్ రంగంలో ఎగుమతులను భారీగా పెంచుకోవడమే లక్ష్యంగా అమెజాన్ ముందడుగు వేస్తోంది. సమీప కాలంలో రూ.100 కోట్ల మేర ఈ–కామర్స్ ఎగుమతులు పెంచాలని ప్రణాళికలు రూపొందించింది. దీని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయమైన మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు.విస్తరణలో భాగంగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో అమెజాన్ తన యూనిట్‌ను మళ్లీ నమోదు చేసుకుంది. వచ్చే మూడు సంవత్సరాల్లో రూ.9,740 కోట్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విశాఖపట్నంలో ఐటీ ఉద్యోగ అవకాశాలు మరింత పెరగనున్నాయని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.