గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా అన్న క్యాంటీన్లు.
-రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 70 క్యాంటీన్ల ప్రారంభం.
-జనవరి 13–15 మధ్య ప్రారంభానికి ప్రణాళిక.
-పూటకు రూ.5కే మూడు పూటల భోజనం.
జనం వాయిస్, అమరావతి, డిసెంబర్ 24:
గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్న క్యాంటీన్ల నిర్మాణ పనులను జనవరి 10లోగా పూర్తి చేసి, జనవరి 13 నుంచి 15 మధ్య ప్రారంభించే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే పట్టణ, నగర ప్రాంతాల్లో 205 అన్న క్యాంటీన్లను ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ క్యాంటీన్ల ద్వారా రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటల భోజనాన్ని పూటకు కేవలం రూ.5కే అందిస్తున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో రోజుకు రెండు లక్షల మందికిపైగా ప్రజలు అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం మరో 70 క్యాంటీన్లను మంజూరు చేసింది. గ్రామీణ పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులకు ఈ క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రజలకు ఇది పెద్ద ఊరటగా మారనుందని పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల్లో కొనసాగుతున్న 205 అన్న క్యాంటీన్ల ద్వారా ఇప్పటి వరకు 7.20 కోట్ల మందికిపైగా పేదలకు ఆహారం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరిలో 3.16 కోట్ల మంది మధ్యాహ్న భోజనం చేయగా, 2.62 కోట్ల మంది ఉదయం అల్పాహారం, 1.42 కోట్ల మంది రాత్రి అల్పాహారం పొందారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అన్న క్యాంటీన్లకు అత్యధిక స్పందన లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పేదలకు ఆకలి తీరేలా, భోజన భద్రత కల్పించడమే అన్న క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం విస్తరించడంతో సామాన్య ప్రజలకు మరింత మేలు చేకూరనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.