రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఆమోదం
- రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల మంజూరు.
- ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల కేటాయింపు.
- జూన్ 1న రెండో విడత ప్రారంభించనున్న సీఎం.
- కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం.
- జనం వాయిస్, హైదరాబాద్, మే 23:
రాష్ట్రంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లతో పాటు పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేశారు.
ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని 24 నియోజకవర్గాల్లో కూడా 1 లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ఇంటి స్థలం లేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే స్థలాలు గుర్తించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రంలో పూరిగుడిసెల్లో నివసిస్తున్న 15 వేల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించాలని తీర్మానించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2027 గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రూ.1000 కోట్లు కేటాయించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి భూసేకరణ, పునరావాసం, మౌలిక వసతుల కోసం రూ.587 కోట్లు మంజూరు చేసింది.
విద్యుత్ పంపిణీ, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్డీఎస్‌ఎస్ పథకంలో చేరేందుకు తెలంగాణ డిస్కంల ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని డీసీఎంఎస్‌లను మార్క్‌ఫెడ్‌లో, రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను హాకాలో విలీనం చేయాలని నిర్ణయించింది. 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోని టాప్-5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలనే లక్ష్యంతో నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈ పాలసీ రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.