మృగశిర చేప ప్రసాదానికి ఏర్పాట్లు.
– జూన్ 8న నాంపల్లిలో కార్యక్రమం.
– భారీగా భక్తులు వచ్చే అవకాశం.
– భద్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి.
జనం వాయిస్, హైదరాబాద్, మే 15:
హైదరాబాద్‌లో ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ ఏడాది జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ ప్రియాంక, బత్తిన కుటుంబ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, క్యూలైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులకు సూచనలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. దశాబ్దాలుగా బత్తిన గౌడ్ కుటుంబం ఈ చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది ఉపశమనం కలిగిస్తుందనే విశ్వాసంతో దేశం నలుమూలల నుంచి ప్రజలు హాజరవుతుంటారు.
చేపలు తీసుకోని వారి కోసం ప్రత్యేకంగా మూలికా మిశ్రమం అందుబాటులో ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు.