ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదు.
– బీఆర్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత.
– సింగరేణి, కాళేశ్వరం, రైతు సమస్యలపై విమర్శలు.
– బీఆర్ఎస్‌లోకి తిరిగి వెళ్లేది లేదని స్పష్టం.
జనం వాయిస్, కొత్తగూడెం, జులై 9:
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి రెండో విడత ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను తిరిగి బీఆర్ఎస్‌లో చేరబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల నిధులు అవినీతి ద్వారా సమకూరినవేనని ఆరోపించిన కవిత, ఆ మొత్తాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీపై భయం లేదని చెబుతూనే ఎన్నికల సంఘానికి వెయ్యికి పైగా ఫిర్యాదులు చేశారని, తమ పార్టీకి ‘టీఆర్ఎస్’ పేరు రాకుండా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజా పోరాటాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, భూకేటాయింపులు, నిర్మాణ అనుమతుల విషయంలో కూడా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ తన సన్నిహితులకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని, కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర ఉందని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. రైతు భరోసా, ఎరువుల పంపిణీ, పంటల బోనస్ విషయంలో కూడా ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని అన్నారు. సింగరేణి అంశంపై మాట్లాడుతూ సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని కవిత ఆరోపించారు. నిజాం కాలంలో సింగరేణికి కేటాయించిన 17 బొగ్గు గనుల్లో ప్రస్తుతం ఒక గనిని మాత్రమే అప్పగించారని, మిగిలిన 16 గనులను కూడా సింగరేణికే ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తాడిచర్ల–2 గనిని కూడా సింగరేణి సంస్థే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సింగరేణిలో కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, ఆధారిత ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతులు, కార్మికులు, తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికే తమ పార్టీ పనిచేస్తోందని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించి రాజకీయాలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులపై నమోదైన కేసులు, రౌడీషీట్లను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై తాము పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కవిత స్పష్టం చేశారు. అవినీతి, భూకేటాయింపులు, రైతులు, కార్మికులు, ఉద్యమకారుల సమస్యలపై తమ పార్టీ నిరంతరం ప్రజల మధ్యే ఉంటుందని తెలిపారు. రాజకీయ విమర్శలకు తాము ప్రజా సమస్యలతోనే సమాధానం చెబుతామని, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.