janamvoice.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 2:25 pm Digital Edition : JANAM VOICE

బెంగళూరులో ప్రేమ పేరుతో దారుణం.

బెంగళూరులో ప్రేమ పేరుతో దారుణం.

‘వెస్ట్రన్ స్టైల్ ప్రపోజల్’ అంటూ ప్రియుడిని సజీవదహనం చేసిన యువతి.

జనం వాయిస్, బెంగళూరు, ఏప్రిల్ 22:

కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రేమ పేరుతో జరిగిన ఘోర ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ‘వెస్ట్రన్ స్టైల్ ప్రపోజల్’ అంటూ తన ప్రియుడిని నమ్మించి, కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటన సినిమాలను తలపించేలా ఉండటం గమనార్హం.
ఈ దారుణ ఘటన బైదరహಳ್ಳಿ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని అంజనానగర్‌లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం:

కిరణ్ మరియు ప్రేరణ ఇద్దరూ ఒక టెలికం స్టోర్‌లో పనిచేస్తూ గత ఏడాది నుంచి ప్రేమలో ఉన్నారు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేరని చెప్పి ప్రేరణ, కిరణ్‌ను తన ఇంటికి పిలిచింది. కొంతసేపు మాట్లాడుకున్న అనంతరం ‘వెస్ట్రన్ స్టైల్ ప్రపోజల్’ చేస్తానని చెప్పి అతన్ని నమ్మించింది.

కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసిన యువతి:

ప్రపోజల్‌లో భాగంగా కిరణ్ కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసింది. మొదట అతను అభ్యంతరం తెలిపినా, విదేశాల్లో ఇలా చేస్తారని చెప్పడంతో అతను నమ్మాడు. ఇదే ఆమె పథకానికి మొదటి అడుగైంది.

పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య:

ముందుగానే సిద్ధం చేసుకున్న పెట్రోల్‌ను కిరణ్ ఒంటిపై పోసిన ప్రేరణ, వెంటనే అతనికి నిప్పంటించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కిరణ్ ఆర్తనాదాలు చేశాడు. అయితే ఆమె అతన్ని కాపాడే ప్రయత్నం చేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది.

ఘటనను ఫోన్‌లో రికార్డ్ చేసిన నిందితురాలు:

కిరణ్ మంటల్లో అల్లాడుతున్న సమయంలో కూడా ప్రేరణ చలించకుండా ఆ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేయడం మరింత షాకింగ్‌గా మారింది. అతని అరుపులు విని చుట్టుపక్కల వారు ఇంట్లోకి చేరేసరికి, కిరణ్ ఇప్పటికే మృతిచెందాడు.

పెళ్లి అనుమానం కారణమా? పోలీసుల విచారణ:

మొదట ఇది ప్రమాదమని భావించిన స్థానికులు, ప్రేరణే హత్య చేసినట్టు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారించగా, ‘అతను నన్ను పట్టించుకోవడం లేదు.. నన్ను పెళ్లి చేసుకోడని అనుమానం వచ్చింది.. అందుకే చంపేశాను’ అని తెలిపినట్లు సమాచారం. ఘటన సమయంలో ఆమె ఇంట్లో తల్లి, సోదరుడు లేరని, ఇది పూర్తిగా పథకం ప్రకారమే జరిగిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు.