janamvoice.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 5:20 pm Digital Edition : GATTU MAHESH

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్..

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్..
–  భారత్ సిరీస్‌తోనే వీడ్కోలు

జనం వాయిస్, స్పోర్ట్స్ న్యూస్:

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చిలో భారత్‌తో జరగబోయే హోమ్ సిరీస్‌ అనంతరం అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతానని ఆమె వెల్లడించారు. 16 ఏళ్లుగా సాగిన తన క్రికెట్ ప్రయాణానికి ఇదే సరైన ముగింపు అని హీలీ భావోద్వేగంగా తెలిపారు. కొద్ది నెలలుగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నానని, చాలా కాలంగా అత్యున్నత స్థాయిలో ఆడిన తర్వాత తనలోని పోటీతత్వం కాస్త తగ్గినట్టు అనిపించిందని హీలీ నిజాయితీగా చెప్పింది. భారత్‌తో జరిగే సిరీస్ తన కెరీర్‌లో చివరిది అవుతుందన్న విషయం చెప్పడం భావోద్వేగంగా ఉందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా తరపున ఆడాలనే తపన ఇంకా ఉన్నప్పటికీ, కెరీర్ ఆరంభం నుంచి నన్ను ముందుకు నడిపించిన దూకుడు, పోటీ తత్వం ఇప్పుడు మునుపటిలా లేదని ఆమె స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా శారీరకంగా, మానసికంగా అలసటకు గురయ్యానని, గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయని హీలీ చెప్పారు. ఇంతకు ముందు లాగా శక్తిని తిరిగి తెచ్చుకోవడం ఇప్పుడు కష్టంగా మారిందని పేర్కొంటూ, అందుకే ఈ సమయాన్నే రిటైర్మెంట్‌కు సరైనదిగా భావించానని వివరించారు. అలిస్సా హీలీ తన కెరీర్‌ను దాదాపు 300 అంతర్జాతీయ మ్యాచ్‌లతో ముగించనున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి 7000కు పైగా పరుగులు చేసి ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ చరిత్రలో ఒక కీలక స్థానం సంపాదించారు. ఆమె రిటైర్మెంట్ నిర్ణయం క్రికెట్ అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది.