బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం.
– కోర్టులో బాధితురాలి వాంగ్మూలం.
– తల్లితో కలిసి మేడ్చల్ కోర్టుకు హాజరు.
– సిట్ దర్యాప్తుపై ఆసక్తి.
జనం వాయిస్, హైదరాబాద్, మే 16:
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలు తన తల్లితో కలిసి మేడ్చల్ కోర్టుకు హాజరై మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బాధితురాలు రెండు సందర్భాల్లో పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తాజాగా కోర్టులో నమోదు చేసిన ప్రకటనతో పాటు బాధితురాలి తల్లి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో తన కుమార్తెకు బలవంతంగా మద్యం ఇచ్చారని, ఆ తర్వాత బలహీన స్థితిలో ఉన్న సమయంలో భగీరథ్ ఒత్తిడి చేసి అనుచితంగా ప్రవర్తించాడని తల్లి ఆరోపించినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత తన కుమార్తె చాలా కాలంగా మానసిక వేదన అనుభవిస్తోందని ఆమె పేర్కొన్నట్లు తెలిసింది. ఈ కేసులో ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు కొనసాగిస్తోందని బాధితురాలి తల్లి తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారానికి సంబంధించి తమ వద్ద వాట్సాప్ చాటింగ్‌లు, సందేశాలు, ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించినట్లు తెలిసింది. దర్యాప్తులో ఈ ఆధారాలు కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో ఆధారాలను పరిశీలిస్తున్నాయి. కేసులో తదుపరి పరిణామాలపై రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.