janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 6:48 pm Digital Edition : JANAM VOICE

భద్రాచలం సమీప ఐదు గ్రామాల అంశం.

భద్రాచలం సమీప ఐదు గ్రామాల అంశం.

– సానుకూలంగా స్పందించాలని కే నారాయణ సూచన.
– తెలంగాణకు అప్పగించాలన్న ప్రతిపాదనకు మద్దతు.
– సామరస్యంతో పరిష్కారం కోరిన సీపీఐ నేత.

జనం వాయిస్, రాజమహేంద్రవరం, మార్చి 1:

భద్రాచలం సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలన్న ప్రతిపాదనకు సీపీఐ జాతీయ నియంత్రణ కమిషన్ ఛైర్మన్ కే నారాయణ మద్దతు తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో ఆలోచించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రిని కలిసి ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు అప్పగించాలని కోరిన విషయం తెలిసిందే. ఆ ప్రతిపాదన సమంజసంగా ఉందని కే నారాయణ అభిప్రాయపడ్డారు. భద్రాద్రి పరిసర ప్రాంతాలకు సంబంధించిన గ్రామాల అంశాన్ని సానుకూలంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భద్రాచలం దేవాలయం విశాలమైనదైనా, అనుబంధ సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో అవసరమైన స్థలాభావం కారణంగా నిర్వహణలో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. భక్తుల సౌకర్యం దృష్ట్యా సమస్యను పరిష్కరించడం అవసరమని సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఐదు గ్రామాల విషయంలో పట్టుదలకు పోకుండా పరస్పర చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనాలని కే నారాయణ సూచించారు.